వికీలో మూలాలు, లంకెలు చేర్చడం

వికీపీడియా లో ఏదైనా ముఖ్యమైన వివరాలు రాసేటప్పుడు వాటిని ఆధార సహితంగా అంటే మూలాలు పేర్కొంటూ రాయడం ఒక నియమం. ఉదాహరణకు స్వామి వివేకానంద వ్యాసం రాసేటపుడు ఆయన అమెరికా తొలి ప్రసంగం గురించి ఒక వాక్యం ఇలా ఉంది.

అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.

ఈ వాక్యానికి ఆధారం ఈ క్రింది లంకెలో ఉంది.
http://www.ramakrishnavivekananda.info/vivekananda_biography/07_the_parliament.htm
కాబట్టి దాన్ని ఆధారంగా చేర్చాలంటే <ref></ref> అనే ట్యాగుల మధ్య చేర్చాలి.

అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.<ref>www.ramakrishnavivekananda.info/vivekananda_biography/07_the_parliament.htm</ref>.

అంతే కాకుండా వ్యాసం చివరలో {{మూలాలజాబితా}} అనే ఒక మూస (Template) ని చేరిస్తే అది క్రింది విధంగా కనిపిస్తుంది.

వికీ మూలం

వికీ మూలం

వికీలో వెతకడం

వికీపీడియాలో చాలా సమాచారం ఉంది. ఆ సమాచారమంతటికీ ద్వారం లాంటిది వెతుకుడు పెట్టె (సర్చ్ బాక్స్).

wikipedia_search

ఈ పెట్టెలో టైప్ చేస్తుండగానే ఆ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యాసాలను సలహాలుగా చూపిస్తుంది. ఉదాహరణకు తెలుగు అని టైపు చెయ్యగానే తెలుగు భాష, తెలుగు వ్యాకరణం, తెలుగు సాహిత్యం,… ఇలా చూపిస్తుంది. వాటిల్లోంచి మనకు కావాల్సిన వ్యాసం మీద నొక్కితే ఆ వ్యాసానికి తీసుకు వెళుతుంది. లేదా వ్యాసం పూర్తి పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కినా ఆ వ్యాసానికి తీసుకు వెళుతుంది.

ఒకవేళ మీరు ఇచ్చిన పేరుతో వ్యాసం లేకపోతే ఈ క్రింది విధంగా చూపిస్తుంది.

wiki_no_article

ముందుగా ఇచ్చిన పేరుకు దగ్గరగా ఏదైనా వ్యాసం ఉంటే ఒక వేళ ఆ వ్యాసం కోసం వెతుకుతున్నారేమో ఊహిస్తుంది. తరువాత ఎర్రటి అక్షరాలతో ఆ పేరుతో వ్యాసం సృష్టించడానికి ఓ లింకు ఇస్తుంది. ఒక వేళ మీరు ఆపేరుతో వ్యాసం రాయాలనుకుంటే ఆ లింకు మీద నొక్కి మీకు తెలిసిన సమాచారాన్ని చేర్చవచ్చు.

ఒక వేళ మీరు వెతుకుతున్న పేరుతో చాలా వ్యాసాలు గనక ఉన్నట్లయితే ఆ వ్యాసాలన్నింటికీ లంకెలతో కూడిన ఓ పేజీని చూపిస్తుంది. ఉదాహరణకు మీరు శ్రీనివాస్ అనే పేరుతో వెతికారనుకుందాం. అప్పుడు ఆ పేజీ ఇలా చూపిస్తుంది.

wiki_multiple_articles

ఇది సాధారణంగా వికీలో ఉన్న సమాచారం(విషయపు పేజీలు) వెతికే విధానం. వికీలో సమాచారమే కాక ఓ వ్యాసాన్ని రాస్తున్నపుడు జరిగే చర్చలు, సభ్యుల చర్చా పేజీలు, ప్రాజెక్టు పేజీలు, మొదలైనవన్నీ ఉంటాయి. వాటిలో వెతకడమెలాగో వచ్చే టపాలో తెలుసుకుందాం.

అసలు వికీపీడియా అంటే ఏమిటి?

వికీపీడియా అంటే ఆన్‌లైన్ లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన సర్వస్వం అంటే ప్రపంచ లో ఉండే అన్ని విషయాల గురించిన సమాచార భాండాగారం. వికీపీడియా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటమే కాక అందులో ఉన్న సమాచారాన్ని ఎవరైనా మార్చగలరు, కొత్త సమాచారాన్ని చేర్చగలరు. అందుకే ఇది స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అయింది.

జనవరి 15, 2001 వ తేదీన జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ లచే ప్రారంభించబడిన వికీపీడియా కొద్ది కాలానికే చాలా భాషల్లోకి విస్తరించింది. 2005 వ సంవత్సరంలో తెలుగు వికీపీడియా ప్రారంభమైంది. రెండు సంవత్సరాల పాటు బాలారిష్టాలతోనే కొనసాగిన తరువాత కొంతమంది బ్లాగర్ల సహకారంతో ఊపందుకుంది. ప్రస్తుతం తెలుగు వికీలో చిన్నా పెద్ద అన్నీ కలిపి సుమారు 50,000 వ్యాసాలున్నాయి. అదే ఆంగ్లంలో ఈ సంఖ్య సుమారు 42 లక్షలు. తెలుగు వికీలో వ్యాసాల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. అంతే కాకుండా ఉన్నా సమాచారాన్ని ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉంది. అందుకు మీ అందరి సహకారం కావాలి. మీకు సహాయంగా సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ బ్లాగు ప్రారంభించడం జరిగింది.